పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలిక వాణిజ్య సముదాయంలో 20 నంబర్ దుకాణంలో ఆరేళ్లుగా అనధికారికంగా ఉంటున్నా పట్టించుకోకపోవడంపై పుర వైస్ చైర్ పర్సన్ జరజాపు దీప్తి మరియు కౌన్సిల్ సభ్యులు గిరి రఘు, రాపాక మాధవరావు, బలబద్రుని శ్రీనివాసరావు, గొర్లె వెంకటరమణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం షాపింగ్ కాంప్లెక్స్ ను పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ఎన్ని దుకాణాలు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉండటానికి కారణం ఏంటి? దుకాణంలో మెటీరియల్ ఉన్నప్పటికీ వారి నుంచి ఎందుకు అద్దె వసూలు చేయడం లేదు అని ప్రశ్నించారు. ఎప్పటినుంచి 20 నెంబర్ షాపు అనధికారికంగా వినియోగిస్తున్నారని అడగ్గా 2017 నుంచి వినియోగిస్తున్నారని ఈ విషయం మా దృష్టిలో లేదని మేనేజర్ రాఘవాచార్యులు, ఆర్ఐ శ్రీనివాసరావు అన్నారు. దీంతో కౌన్సిల్ సభ్యులు మరింత ఆగ్రహం చెందారు. అజెండాలో షాపు ఖాళీగా ఉందని ఎలా పెట్టారని పాలకవర్గ సభ్యులు తప్పుదారి పట్టించేందుకు అలా చేశారా అని ప్రశ్నించారు. తక్షణమే గడిచిన ఆరేళ్లు అద్దె డబ్బులు అధికారులు వసూలు చేయాలి లేదా అధికారుల జీతాల నుంచి కట్టించేలా తీర్మానం చేస్తామని అన్నారు. షాపులో ఉన్న మెటీరియల్ పట్టుకు వెళ్లకుండా పురాధికారులు తాళాలు వేశారు. షాపు నిర్వాహకుడికి నోటీసులు జారీ చేస్తామని అధికారులు అన్నారు