ఏడు ప్రాంతాల్లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ లు

  • సాలూరులో సంజీవని ఆరోగ్య కేంద్రం ప్రారంభించిన నారా భువనేశ్వరి

గిరిజన సోదర, సోదరీమణులకు వైద్య సేవలు అందించడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. పార్వతీపురం మండలం జిల్లా సాలూరులో మంగళవారం ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు. అనంతరం క్లినిక్ లో ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. క్లినిక్ లో వైద్య సదుపాయాలను ఆమె సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని క్లినిక్ సిబ్బందికి సూచించారు. అనంతరం విలేకరుల‌ సమావేశంలో మాట్లాడారు.
• ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికీ వైద్యం అందక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను మనం చూస్తున్నాం.
• సాలూరు ప్రజలకు వైద్య సేవలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ క్లినిక్ ను ప్రారంభించాం అన్నారు.
• ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 27ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉచిత విద్య, వైద్యం తెలుగు ప్రజలకు అందిస్తూ సేవలు అందిస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్టు నుండి 3 బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు నిర్వహిస్తున్నాం. వీటి నుండి ఇప్పటి వరకు 8లక్షల మంది ప్రజలకు రక్తాన్ని ఇచ్చి కాపాడాం.
• 81,361 యూనిట్ల రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా అందించాం. 19,956 యూనిట్ల రక్తాన్ని తలాసేమియా బాధితులకు ఉచితంగా అందించాం. 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా అందించాం.
సంజీవని క్లినిక్స్ ద్వారా 67,104 కుటుంబాలు లబ్ధి పొందాయి అన్నారు. పాకాల, పాలకొండ, పోలవరం, కురుపాం, పాడేరు, రంపచోడవరం, అరకు ప్రాంతాల్లో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కరోనా కష్టసమయంలో రూ.1.5కోట్ల రూపాయలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం‌. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా రెండు క్లస్టర్లలో మూడు పెద్ద వాటర్ ప్లాంట్లు పెట్టి 3.5లక్షల మంది జనాభాకు సురక్షిత మంచినీరు అందిస్తున్నాం.
ఎన్టీఆర్ పేదల పట్ల సంకల్పించిన సేవా కార్యక్రమాలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్నాం. సాలూరు పట్టణ ప్రజలు హెల్త్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకుని, వైద్య సేవలు పొందాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *