విజయనగరం జిల్లా పోలీసు
* రూ.15 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లును స్వాధీనం చేసుకున్న 2వ పట్టణ పోలీసులు
* ప్రధాన నిందితుడిని పట్టుకొనేందుకు రంగంలోకి ప్రత్యేక బృందాలు
విజయనగరం పట్టణం గుమ్చి ప్రాంతంలో దొంగనోట్లు చలామణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 15 లక్షలు విలువైన దొంగనోట్లును స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు వెల్లడించారు.
విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం
విజయనగరం 2వ పట్టణ సిఐ కోరాడ రామారావుకు వచ్చిన సమాచారంతో 2వ పట్టణ ఎస్ఐ ఐ. దుర్గా ప్రసాద్ మరియు సిబ్బందితో విజయనగరం పట్టణం గుమ్చి ప్రాంతానికి చేరుకొని, అక్కడ అనుమానస్పదంగా సంచరిస్తున్న (ఎ-1) విజయనగరం వై.ఎస్.ఆర్.నగర్ కు చెందిన బంగారి చక్రధర్ అలియాస్ చక్రి (36) (ఎ-2) దత్తిరాజేరు మండలం గడసం గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ (33) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 25 వేలు చొప్పున నకిలీ కరెన్సీ రూ.500/- ల నోట్లును స్వాధీనం చేసుకున్నారన్నారు. నోట్లును పరిశీలించి, వారిని విచారణ చేయగా, తమకు ఈ నకిలీ నోట్లును చలామనీ చేసేందుకుగాను (ఎ-3) ఒడిస్సా రాష్ట్రం జాపూర్ జిల్లా చెంచునార గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ అనే వ్యక్తి విజయనగరం రైల్వే స్టేషను వద్ద రూ.15,50,000/-ల విలువైన నకిలీ రూ.500/- ల కరెన్సీ నోట్లు ఇచ్చినట్లు, అందుకు ప్రతిగా తాము రూ.3 లక్షల ఒరిజినల్ నోట్లును (ఎ-3) చంద్రమణిపాల్ కు చెల్లించినట్లు విచారణ లో ముద్దాయిలు తెలిపారు.
నిందితులను మరింత లోతుగా విచారణ చేయగా (ఎ-1) బంగారి చక్రధర్ పై ఇప్పటికే విజయనగరం 1వపట్టణ పోలీసు స్టేషనులో రెండు రేప్ కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీ షీటు కూడా ఉందన్నారు. (ఎ-1) బంగారి చక్రధర్ విజయనగరం సబ్ జైలులో రిమాండులో ఉండే సమయంలో గజపతినగరం కేసులో అరెస్టు కాబడిన ఒడిస్సాకు చెందిన (ఎ-3) చంద్రమణిపాల్ పరిచయం అయినట్లు, తాను దొంగనోట్లును చలామనీ చేస్తుంటానని, దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన (ఎ-2) రాజాన విష్ణు అనే వ్యక్తికి కూడా తానే దొంగనోట్లును సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారన్నారు. అప్పటి నుండి వారితో స్నేహం కొనసాగిస్తూ వస్తున్నట్లుగా నిందితులు అంగీకరించారని విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు తెలియజేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న (ఎ-3) చంద్రమణిపాల్ నుపట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని, అతడిని పట్టుకొంటే దొంగనోట్లు ముద్రణ ఎవరు చేస్తున్నది? ఎక్కడ చేస్తున్నది? ఈ నేరంలో ఇంకెవరైనా పాత్రధారులు ఉన్నారా? అన్న విషయాలు వెల్లడవుతాయన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన 2వ పట్టణ సిఐ కోరాడ రామారావు, ఎస్ఐ ఐ.దుర్గా ప్రసాద్ మరియు ఇతర పోలీసుసిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించినట్లుగా తెలిపారు.