సాలూరు: పోడు, బంజరు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లేడు వలస, బొర్ర పనుకువలస గ్రామాల గిరిజన రైతులు రిలే దీక్ష చేపట్టారు. గురువారం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో శిబిరం నిర్వహించారు. సాగు భూములకు హక్కులు కల్పిస్తామని రెవిన్యూ అధికారులు పలుమార్లు హామీలు ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పట్టాలు ఇవ్వడం లేదని గిరిజన సంఘ నేతలు సుందర్ రావు, జానకి రావు అన్నారు. నెల రోజుల కిందట తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదు సమస్య పరిష్కరించలేదని అన్నారు. పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం సాగిస్తామని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు అన్నారు. గిరిజనుల రిలే దీక్షకు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బంజ్ దేవ్ సంఘీభావం తెలిపారు. ఈ ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పూర్తిగా పక్కన పడేసిందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం శ్రీను ,.ఎన్ వై నాయుడు, చినబాబు తదితరులు పాల్గొన్నారు.