పార్టీ విజయానికి సైనికుల్లా పని చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి పిలుపు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభివృద్ధి చేసి చూపించారు

చంద్ర‌బాబు శిలాఫలకాలతో సరిపెట్టారు

విశాఖ పార్లమెంటు స్థానాన్ని, ఏడు అసెంబ్లీ సీట్లను వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకోవాలి

విశాఖపట్నం : ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బీచ్ రోడ్లో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ ..ప్రస్తుతం రాష్ట్రంలోని పేదలకు అందుతున్న పథకాలు కొనసాగాలంటే వైయ‌స్ జ‌గ‌న్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో విద్యా, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమృద్ధిగా అందుతున్నాయి అంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ అని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కేవలం శిలాఫలకాలతోనే కాలం వెళ్లబుచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మూడు పోర్ట్లు, పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డికి దక్కుతుందని సుబ్బారెడ్డి చెప్పారు. విశాఖ షిప్ యార్డ్ సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి పోర్టు సుస్థిరతకు బొత్స ఝాన్సీ విశేష కృషి చేశారని, విశాఖ ప్రాంతంపై పూర్తి అవగాహన కలిగిన బొత్స ఝాన్సీ ని తిరిగి గెలిపిస్తే ఈ ప్రాంతానికి మరింత మేలు జరుగుతుందని, అలాగే విశాఖపట్నం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.


రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేకమందికి పదవులు ఇచ్చారని, తిరిగి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిని అధికారంలోకి తీసుకువచ్చి రుణం తీర్చుకోవాలని నాయకులకు పిలుపునిచ్చారు. సమాజానికి మంచి చేయాలన్న లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి పని చేస్తున్నారని తిరిగి ఆయన  ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సత్యనారాయణ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో    దోపిడీదారులకు నిజాయితీపరులకు మధ్య యుద్ధం జరుగుతోందని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో అవినీతిని చూసామని, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని చూస్తున్నామని ఆయన చెప్పారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను పార్టీ ఏనాడు విస్మరించదని, వారికి సముచితస్థానం కల్పిస్తుందని బొత్స చెప్పారు.
ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశారో చెప్పలేక ముఖం చాటచేస్తున్నారని, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండాగా భావించి ముందుకు వెళ్తానని, రెండుసార్లు ఈ ప్రాంతానికి ఎంపీగా చేసిన తనను మళ్ళీ గెలిపిస్తే మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఝాన్సీ హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో జతకటిన మూడు పార్టీలు ప్రజలకు వివరణ ఇవ్వాలని ఝాన్సీ డిమాండ్ చేశారు.


రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. గర్జన 41 ఏళ్ల రాజకీయ చరిత్రలో బీసీ మహిళకు అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు చేయలేనంత అభివృద్ధిని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చేసి చూపించారని అన్నారు. విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర నాయకులకు పెద్దదిక్కుగా నిలబడ్డారని, తన తండ్రి మరణించిన తర్వాత, మళ్లీ రాజకీయంగా తమ కుటుంబం ఎదగడానికి, తనను ఈ స్థాయికి తీసుకురావడానికి బొత్స సత్యనారాయణ కృషి ఎంతో ఉందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. షిప్ యార్డ్ ను ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన వచ్చినపుడు బొత్స ఝాన్సీ అందుకు అడ్డుపడి అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖర‌రెడ్డి తో మాట్లాడి, షిప్ యార్డ్ ప్రైవేట్ పరం కాకుండా కార్మికులకు అండగా నిలబడ్డారని అమర్నాథ్ చెప్పారు. విజయవంతంగా, రెండుసార్లు ఎంపీగా విజయం సాధించిన బొత్స ఝాన్సీ ని తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమర్నాథ్ చెప్పారు. ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చేసిన సేవలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన విపక్షాలకు ఎప్పుడు రాలేదని ఇవి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ వలన మాత్రమే సాధ్యమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు విశాఖ దిక్సూచి కాబోతోందని , రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే ఆయన విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని, తద్వారా విశాఖ రూపురేఖలు మారుతాయి అని అమర్నాథ్ చెప్పారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించింది వైసీపీ అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. కానీ ఈ ప్రైవేటీకరణ అంశాన్ని  వైసిపి పై నెట్టేయాలన్న ఆలోచనలో ఆ మూడు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని అమర్నాథ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ విషయంలో ఈ మూడు పార్టీల వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. నీతి నిజాయితీలతో పరిపాలించిన  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విజయం సాధిస్తారని ధర్మమే గెలుస్తుందని మంత్రి అమర్నాథ్ ఈ సందర్భంగా చెప్పారు.

 కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, విశాఖ ఎంపీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర ,నగర మేయర్ హరి వెంకట్ కుమారి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అవంతి శ్రీనివాస్, కారుబండి శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లు పిన్నింటి వరలక్ష్మి,, బాలరాజు, తైనాల కుమార్, వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, విశాఖపట్నం ఉత్తరాంధ్ర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అడ్డాల కృపా జ్యోతి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *