కోట్లు విలువ చేసే పనులు చీకట్లో చేస్తారా
పేదల పనులు పట్టించుకోరా
అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిల్ సభ్యులు
సాలూరు పరిపాలికలో చేసే ప్రతి పనికి ధర కడతారా.. కోట్లు విలువ చేసే పనులు చీకట్లో చేస్తున్నారు. పేదల పనులు మాత్రం పట్టించుకోరు. అంటూ అధికారులపై పాలకవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలిక కౌన్సిల్ హాలులో సోమవారం పాలకవర్గ సమావేశం పుర అధ్యక్షురాలు పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగింది. అజెండాలో పలు అంశాలపై చర్చించారు. ఖాళీ స్థలంపై పన్ను వేయాలని జనాదేవ్ అనే వ్యక్తి దరఖాస్తు చేస్తే ఇప్పటివరకు ఎందుకు పని పూర్తి చేయలేదని వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు ఆర్ ఐ శ్రీనివాస్ ను ప్రశ్నించారు.
కోట్ల రూపాయలు విలువచేసే పనులు గుట్టు చప్పుడు కాకుండా చీకట్లోనే చేసేస్తున్నారు. పేదల పనులు మాత్రం చేయరా అని నిలదీశారు. ఏ పని చేస్తే ఎంత ఇవ్వాలో ధర నిర్ణయించి బోర్డులు పెట్టండి అన్నారు. ప్రధాన సరఫరా కేంద్రానికి క్లోరిన్ సరఫరా చేసే కాంట్రాక్టు ముందుగా ఎందుకు టెండర్ పిలవలేదని సభ్యులు మాధవరావు, వెంకటరమణ గిరి రఘు ప్రశ్నించారు.
ప్రతి పనికి డబ్బులు వసూలు చేసి ఇప్పటికే ఏసీబీ కీ పట్టుబడి సాలూరు పరువు తీశారు. మళ్లీ చిన్న-పెద్ద పనికి కూడా డబ్బులు అడుగుతూ బజారుకు ఈడుస్తారా అని వైస్ చైర్పర్సన్ జరజాపు దీప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ లో 20వ నంబరు దుకాణం అద్దె డబ్బులు ఏమయ్యాయో తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. ఇప్పటికే విచారణ ప్రారంభించామని కమిషనర్ తెలిపారు. అనంతరం పట్టణంలోనీ పలు సమస్యలపై చర్చించారు.