వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం లో 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అలాగే 1600 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజలకు అందించినట్లు ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర అన్నారు.
శనివారం శివరాంపురం గ్రామంలో ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని రాజన్న దొర ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి వైకాపా చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను వివరించి మళ్లీ వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు. శివరాంపురం గ్రామంలో ప్రజలు అడిగిన, అడగని సమస్యలను కూడా పరిష్కరించానన్నారు. రోడ్లు, కాలువలు, పాఠశాల భవనం, గ్రామ సచివాలయం భవనాలు నిర్మించాం అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు శివరాంపురం వేగవతి నదిపై బ్రిడ్జి నిర్మస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది అన్నారు. ఇప్పటికీ టిడిపికే ఇక్కడ ప్రజలు ఓట్లు వేసి మోసపోతున్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రెండేళ్లు కరోనాతో యుద్ధం చేసి ప్రజల ప్రాణాలను కాపాడిందన్నారు. మిగిలిన మూడు ఏళ్లలో పేదలకు సంక్షేమ పథకాల అందించి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేసిందన్నారు. శివరాంపురం వంతెన నిర్మాణానికి తాను ఎప్పుడూ హామీ ఇవ్వలేదు కానీ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు రప్పించాం కాంట్రాక్టర్ చనిపోవడంతో పనులు ఆగిపోయాయి అయినప్పటికీ మళ్లీ దానిని పూర్తి చేసేందుకు సుమారు 6 కోట్ల రూపాయలు నిధులు రప్పించానన్నారు. అవినీతిలో టిడిపి కోరుకుపోయిందని ఆ పార్టీని భూస్థాపితం చేయాలని పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో అన్నారు కానీ అదే పార్టీతో ఇప్పుడు జత కట్టారు అన్నారు. అలాగే ప్రధాని మోడీని ఉగ్రవాదిగా ప్రచారం చేసిన చంద్రబాబు నేడు ఆయన మద్దతు కావాలని కాలబేరానికి తిరగడన్నారు. కుర్చీల కోసమే.. అధికార దాహంతో మూడు పార్టీలు జతకట్టాయని విమర్శించారు. నియోజకవర్గంలో శివరాంపురం గ్రామంలో చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఓటర్లకు అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ గెలిపించాలని కోరారు. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేస్తున్న టిడిపి నేతలను నమ్ముకుంటే గడ్డు పరిస్థితి రాక తప్పదన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న పేదలకు మంచి రోజులు మరిన్ని రావాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలన్నారు. అనంతరం పట్నంలోని గుమ్మడం గ్రామంలో రామ మందిరంలో పూజలు నిర్వహించే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైకాపా నేతలు మావుడి రంగు నాయుడు, ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ రెడ్డి, పుర ఉపాధ్యక్షులు దీప్తి, అప్పలనాయుడు, సూరిబాబు, ఈశ్వరరావు, తాడి శంకర్రావు, లక్ష్మి, జరజపు మోహన్, దండి శ్రీనివాసరావు, రెడ్డి సురేష్, పద్మజ తదితరులు పాల్గొన్నారు.