సాలూరు పురపాలిక సమావేశం గురువారం వాడివేడిగా సాగింది. పురాధ్యక్షురాలు పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశం కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. కొత్తగా కొనుగోలు చేసిన జెసిబి కాంపాక్టర్ వాహనాలకు డ్రైవర్లు, క్లీనరు అవసరమని అజెండాలో పెట్టారు. ఇప్పటికే ఆరుగురు డ్రైవర్లు పనిచేస్తున్నారు వారిలో నలుగురు మాత్రమే వాహనాలు నడుపుతున్నారు మిగిలిన ఇద్దరు సెలవు పెట్టి లారీ లైన్లోకి వెళ్తున్నారు. ఉన్నవారిని వినియోగించకుండా కొత్త పోస్టులు ఎందుకని కౌన్సిల్ సభ్యులు గిరి రఘు ఆర్ మాధవరావు గొర్ల రమణ ప్రశ్నించారు. జెసిబి నడిపేందుకు డ్రైవర్ అవసరమని సానిటరీ ఇన్స్పెక్టర్ ఫకీర్ రాజు అన్నారు. ఖాళీగా ఉన్న డ్రైవర్లకు జెసిబి డ్రైవింగ్ శిక్షణ ఇప్పించి వాటిని వినియోగించాలని సభ్యులు సూచించారు. కార్యాలయం ఆవరణలో కొత్త పాత వాహనాలు పార్కింగ్ చేసేందుకు షట్ నిర్మాణానికి 11.50 లక్షల రూపాయలతో అధికారులు ప్రతిపాదించగా సభ్యులు అంతా దానిని వ్యతిరేకించారు. వార్డులలో సమస్యలు పరిష్కరించడానికి 10,000 20,000 లేవని చెబుతున్న అధికారులు లక్షల రూపాయలతో షట్ నిర్మాణానికి ఎలా ప్రతిపాదనలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను నిలిపివేయాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించని అధికారులు, సాధారణ నిధులు రూ.లక్షల తో షెడ్డు నిర్మాణానికి ఎలా ప్రతిపాదిస్తారని ఉపాధ్యక్షురాలు జరజాపు దీప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అజెండాలో ప్రవేశపెట్టిన మూడు అంశాలను ఆమోదించారు. సమావేశంలో వైస్ చైర్మన్ కొండపండు అప్పలనాయుడు కమిషనర్ ప్రసన్నవాణి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు