తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
సింహ రూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై రాములవారు భక్తులకు కనువిందు చేయనున్నారు.
వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణభట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.