ఆసుపత్రులు, వసతి గృహాలు, పాఠశాలలు, గృహాలకు ఉచిత విద్యుత్ అందించేందుకు యోచన
జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు పాఠశాలలు, వసతి గృహాలకు ఉచిత విద్యుత్ అందించే గృహాలకు పీఎం సూర్య ఘర్ పథకం వినియోగించే ఆలోచన ఉందని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. పి. ఎం సూర్య ఘర్ దేశంలో గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకం అన్నారు. ఈ పథకాన్ని 2024 ఫిబ్రవరి 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారన్నారు. ఈ పథకం కింద గృహాల పైకప్పులపై సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీతో అందించడం జరుగుతుందని,. సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40 శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు.
దేనికి ఎంత రాయితీ అంటే..
ఈ పథకం కింద, గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ కెపాసిటీని నిర్ణయించవచ్చు. సగటు నెలవారీ విద్యుత్ వినియోగం (యూనిట్‌లు) ఖర్చు తగ్గుతుందని చెప్పారు. పథకం కింద, 150 యూనిట్ల వరకు విద్యుత్ కు, 1 నుండి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ లు అవసరం. దీనికి రూ.30 వేల నుండి 60 వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. 150 నుండి 300 యూనిట్ల వరకు 2 నుండి 3 కిలోవాట్ల సామర్థ్యం సరిపోతుంది. సబ్సిడీ రూ. 60 వేల నుండి 78 వేల వరకు అందుతుంది. 300 కంటే ఎక్కువ యూనిట్ల పవర్ కు 3 కె వి కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే సరిపోతుంది. రూ.78 వేల వరకు సబ్సిడీని పొందేందుకు అర్హత ఉంటుందని చెప్పారు.
పిఎం సూర్య ఘర్ జిల్లా అవసరాలకు మంచి పథకం అని కలెక్టర్ అన్నారు. గృహాలకు ఉచిత విద్యుత్తు కోసం ఈ పథకం ప్రయోజనకరమని, ప్రభుత్వానికి కూడా విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచుటకు, కర్బన ఉద్గారాలను తగ్గించుటకు మంచి పథకమని ఆయన అభిప్రాయపడ్డారు. పథకాన్ని వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మిగులు యూనిట్లను కూడా గృహాస్తులు విక్రయించవచ్చని ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న కుటుంబాలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.