మార్చి 8న శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి ప‌ర్వ‌దినం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 8వ తేదీ శుక్ర‌వారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘ‌నంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా శుక్ర‌వారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి.

ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. మార్చి 9వ తేదీ శ‌నివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకాలు నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో భ‌క్తిసంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

మార్చి 9న శివపార్వతుల కల్యాణం

శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన శ‌నివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.250/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *