గ్రామసభలు పక్కాగా నిర్వహించాలి

జేసీ ఎస్.ఎస్.శోభిక

పార్వతీపురం డివిజన్‌ పరిధిలో ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం గ్రామసభలను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక రెవిన్యూ అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల అధికారులతో పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ పార్వతీపురం డివిజనులో ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పక్కాగా గ్రామసభలను నిర్వహించాలని అన్నారు. ఇప్పటికే జరుగుతున్న గ్రామసభల నిర్వహణపై ఆమె వివరాలు అడిగి తెలుసు కున్నారు. గ్రామాల్లో రీసర్వేపై చేపట్టనున్న గ్రామసభల గురించి ముందుగా రైతులకు సమాచారం అందించాలని అన్నారు. తద్వారా రైతులందరూ అందుబాటులో ఉంటారని చెప్పారు. గ్రామసభకు ముందు రెవిన్యూ రికార్డులన్ని సిద్ధం చేసుకోవాలని తెలిపారు. గ్రామాల వారీగా భూముల సర్వేపై ఆరా తీసిన ఆమె గ్రామసభల్లో  రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని అన్నారు. ఈ క్రమంలో రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా నమోదుచేసి, వాటిని సరిచేయాలని సూచించారు. అభ్యంతరాలు చేసిన రైతుల భూములను స్వయంగా పరిశీలించి, రీసర్వే పక్కాగా చేపట్టాలని అన్నారు. రెవిన్యూ రికార్డులు, రైతుల భూవివరాలు సరిపోయిన తదుపరి వాటిని ధ్రువీకరించాలని సూచించారు. రీసర్వేలో అలసత్వం, జాప్యం పనికిరాదని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.  సమావేశంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోశ్ శ్రీవాస్తవ, డివిజన్‌ లోని తహశీల్దార్లు,ఉప తహశీల్దార్లు, మండల, గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *