ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 146 వినతులు

జాయింట్ కలెక్టర్ శోభిక

పార్వతీపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమానికి 146 వినతులు అందాయని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజిఆర్ఎస్ కార్యక్రమం జేసీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పీజిఆర్ఎస్ కు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రతి జిల్లా అధికారి విధిగా హాజరు కావాలని ఆదేశించారు. వచ్చిన అర్జీలను ఎప్పటికపుడు పరిశీలించి, సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.వచ్చిన అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

*బలిజిపేట మండలం అరసాడ గ్రామానికి చెందిన పి.శేషగిరి తనకు బ్యాటరీ వాహనం మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.

పార్వతీపురం మండలం విశ్వంభర పురం గ్రామానికి చెందిన పి.మహేశ్వరరావు తనకు పింఛను మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
20 ఏళ్ల క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చినందుకు, ఏదో ఒక
ఉద్యోగం ఇస్తామని అప్పటి అధికారి హామీ ఇచ్చారని, కావున ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా  నైట్ వాచ్ మాన్  పోస్ట్  తనకు ఇమ్మని జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గ్రామానికి చెందిన బి.లలిత కుమారి కోరారు.
బలిజిపేట మండలం వంతరాం గ్రామానికి చెందిన బి.సింహాచలం వినతి పత్రం ఇస్తూ, సర్వే నెంబర్. 116 లో ఉన్న దత్తేశ్వరం చెరువు ఆక్రమణకు గురైందని, కావున చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పార్వతీపురం మండలం జగన్నాధ పురం గ్రామానికి చెందిన పి.రామారావు గత ప్రభుత్వ హయాంలో తన భూమికి రీ సర్వే జరిగి నప్పటికీ,ఇంతవరకు పట్టాదారు పాస్ బుక్ మంజూరు చేయలేదని అర్జీ అందజేశారు.
గరుగుబిల్లి మండల కేంద్రంలో ఆధార్ కేంద్రాన్ని పునః ప్రారంభించాలని కోరుతూ, గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఎ.రాజ్ కుమార్ అర్జీని అందజేశారు.
కురుపాం గ్రామానికి చెందిన జి.గౌరీశ్వరి పశువుల శాలకు అనుమతి ఇప్పించాలని కోరారు.
వి.డి డిగ్రీ కాలేజ్ వెనుక ఉన్న పంట పొలాలను ఊర పందులు నాశనం చేస్తున్నాయని, సంబంధిత యాజమాన్యానికి చెప్పి ఊర పందులను కట్టడి చేయాలని కోరారు.
పార్వతీపురం మండలం క్రిష్ణపల్లి పంచాయితీలోని పార్వతీనగర్, వరాలగడ్డకు అనుకోని ఉన్న స్మశాన వాటిక పునర్నిర్మాణం, కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేయాలనీ ఆ గ్రామస్తులు ఆర్జీ పెట్టుకున్నారు.
గరుగుబిల్లి మండలం రావివలస గ్రామస్తులు తమ గ్రామంలో ప్రతీ మూడు రోజులకు 10 నుంచి 18 గం. లు కరెంటు ఉండడం లేదని, ఒకవేళ కరెంటు ఉన్నప్పటకి లోఓల్టెజ్ ఉంటుందని, కావున మా పంచాయతీ లో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే తమ  పంచాయితీ లో ఉన్న కరెంటు స్తంబాలు గాలులకు, తుఫాన్లకు పాడై విరిగిపోడానికి సిద్ధంగా ఉన్నాయని, కావున కరెంటు స్తంభాలు కొత్తవి వేయాలని కోరారు. అలాగే
వినికిడి లోపం ఉన్న తమకు వినికిడి పరికరాలను అందించాలని పార్వతీపురం మండలం కలవరిపేటకు చెందిన వడ్లమాని ప్రసాదరావు, పాలకొండ మండలం గోపాలపురంకు చెందిన కలివరపు నందీశ్వరరావు, వీరఘట్టం మండలం సత్తలకవిటికి చెందిన కొత్తవలస రమణమ్మ జేసీకీ అర్జీలను అందజేయగా, వారికి వినికిడి పరికరాలను తక్షణమే అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. కేశవ నాయుడు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *