క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి
మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి సమస్యలు తెలియజేసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తున్నా అని ఆమె అన్నారు. రహదారులు మంజూరు చేయాలని పాచిపెంట మండలం కొత్తూరు పంచాయితీ కొత్త పొలంవలస, పాత పొలంవలస గ్రామాల నుండి గిరిజనులు కోరారు. తాతలు, తండ్రులు కాలం నుండి రుద్ర భూమిగా వాడుకుంటున్న భూమిని కొంతమంది ఆక్రమించి రుద్ర భూమికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారని సాలూరు మండలం కందులపథం గ్రామ పంచాయితీ తీనుసామంతవలస, మర్రివానివలస గ్రామస్తులు మంత్రికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జి.సి.సిలో మా తల్లితండ్రులు పనిచేసి కాలం చేసారు. వారి కుటుంబ సభ్యులైన మేము చదువుకొని నిరుద్యోగులుగా వున్నాం., కారుణ్య నియామకాలు జరిపి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ వినతి సమర్పించారు. పట్టణంలో కాలుష్య నివారణ కొరకు నగర వనం నిర్మించుటకై ప్రభుత్వం నిధులు కేటాయించాలని సాలూరు సత్యసాయి డ్యానమండలి సభ్యులు కోరారు.