నివాళి అర్పించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు చంద్రశేఖర్, సంధ్యారాణి
భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. భగవాన్ బిర్సా ముండా అని కేంద్ర మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం అమరావతిలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ఘనంగా నిర్వహించారు. ముందుగా మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భగవాన్ బిర్సా ముండా గొప్పతనం, గిరిజనుల అభివృద్ధి కోసం చేసిన పోరాటాలను మంత్రులు కొనియాడారు.
బ్రిటిష్ కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించి, 22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై బిర్సా యుద్ధం ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఇతని గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా అని ఆమె అన్నారు.
గిరిజనుల అభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని అన్నారు. అనంతరం సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు గిరిజనులతో కలిసి మంత్రులు నృత్యాలు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.