స్పెషల్ డిఎస్సీ వద్దు అనడం సమంజసం కాదు
పార్వతీపురంలో గిరి ప్రతిభ ఉచిత డిఎస్సీ శిక్షణ ప్రారంభం
పార్వతీపురంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ ను గిరిజన సామాజిక భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఉచిత కోచింగ్ రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్ట మొదట సారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 16500 పోస్టుల తో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. కోచింగ్ కు సుముఖంగా ఉన్న అభ్యర్థులకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతోందని ఆమె తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని అన్నారు. కోచింగ్ తీసుకున్న అందరూ ఉపాధ్యాయ పోస్టులు సాధిస్తారని ఆమె విశ్వాసం ప్రకటించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న ఉపాధ్యాయులు స్పెషల్ డిఎస్సీ వద్దు అనడం సమంజసం కాదని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో రూ.8000 కు ఉద్యోగం చేస్తుంటే 2016 లో రూ.18 వేలకు అప్పటి ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెంచారని తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క దరఖాస్తు కూడా ఇవ్వలేదని ఇప్పుడు 1650 మంది ఇప్పుడు రోడ్డు మీద పడతామని అంటున్నారని చెప్పారు. వారికి ఉద్యోగాల నుండి తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హతలు, ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు రావాలని, గిరిజన విద్యార్థులకు మంచి ప్రామాణిక విద్య అందాలని అన్నారు. గిరిజన పిల్లలను బాగా చదివించాలని ఆమె చెప్పారు. డీఎస్సీలో 2 వేల పోస్టులు గిరిజనులకు కేటాయించడం జరిగిందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో 2 వేల రహదారులను రూ.2500 కోట్లతో వేయడం జరుగుతోందని, డోలీ మోతలు ఉండకూడదని కృత నిశ్చయంతో ఉన్నామని వివరించారు. గుంతలు లేని రహదారులను చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 4 బెడ్స్ తో కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, త్వరలో కురుపాం, పాలకొండ నియోజక వర్గాలలో ప్రారంభిస్తామని తెలిపారు. గిరిజనులకు అండగా ప్రభుత్వం ఉందన్నారు.
కురుపాం శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆకాక్షించారు.
పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పార్వతీపురం శాసన సభ్యులు బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ ప్రతిభ అందరి సొత్తు అన్నారు. ప్రతీ ఒక్కరిలో ప్రతిభ ఉందని దానిని చక్కగా వినియోగించుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఆంధ్రా దిశగా అడుగులు వేస్తూ 20 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పం అన్నారు. విశాఖకు టి.సి.ఎస్ వస్తుందని, 10 వేల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని కోరారు. ముఖ్య మంత్రి ఆశయం ప్రతి ఒక్కరి భవిష్యత్తు తీర్చిదిద్దాలని అన్నారు. అద్భుత ప్రపంచం మీ కోసం వేచి చూస్తోందని అవకాశాలు అందుపుచ్చుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ కష్టపడితే ఫలితం దక్కుతుందన్నారు. ప్రతిభను నిరూపించాలని ప్రోత్సహించారు. గ్రంథాలయ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీతంపేట ఐటిడిఏ ప్రాంతంలో మరో కోచింగ్ ఏర్పాటు చేస్తామని, అవసరమైతే గుమ్మలక్ష్మిపురం వంటి చోట్ల కూడా ఏర్పాటు చేయుటకు సిద్ధంగా ఉన్నామన్నారు. రేయింబవళ్ళు నడిచే గ్రంధాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో
ఈ నెల 6,7 తేదీల్లో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ అవకాశాలుపై అవగాహన కార్యక్రమాలు సీతంపేట, పార్వతీపురం లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరి ప్రతిభ ద్వారా అన్ని రకాల ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని ఆయన చెప్పారు.
పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఉచిత డీఎస్సీ కోచింగ్ కు దరఖాస్తులు స్వీకరించగా 230 దరఖాస్తులు అందాయని వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా వంద మంది ఎంపిక అయ్యారన్నారు. స్టడీ మెటీరియల్, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం ఉచిత భోజన సౌకర్యం కల్పించామని చెప్పారు.
ఈ సందర్భంగా గిరిజన సాధికార భవన ప్రాంగణంలో మునగ మొక్కలను మంత్రి నాటారు.
జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్ తిరుపతి నాయుడు, ఐటిడిఏ ఏపిఓ ఏ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.