యుపి సిఎం ఆదిత్య నాధ్ ను కోరిన విజయనగరం ఎంపీ కలిశెట్టి
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాధవ నాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు యోగి ఆదిత్యనాథ్ ని లక్నో లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అయోధ్య, వారణాసి లాంటి పుణ్య క్షేత్రాలకు అత్యధికంగా తరలి వెళ్ళే తెలుగువారి సౌకర్యార్థం కొన్ని సౌకర్యాలను కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.
అయోధ్య, వారణాసి నగరాల్లో తెలుగువారికి సమాచార కేంద్రాల ఏర్పాటు చేయండి*
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి అయోధ్య మరియు వారణాసి నగరాలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందనీ. ఈ భక్తుల కోసం రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, మరియు ప్రధాన ఆలయ ప్రాంతాల్లో తెలుగులో సమాచారం అందించే సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ అప్పలనాయుడు వినతిపత్రం ద్వారా కోరారు. ఇలాంటి కేంద్రాలు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మరియు భక్తుల కోసం భాషా సమస్యలను పరిష్కరించడానికి ఎంతో ఉపయోగపడతాయనీ తెలియజేశారు.
అయోధ్య రామమందిరం సమీపంలో తెలుగు భక్తుల వసతి ఆహార అవసరాలను తీర్చడానికై భవన నిర్మాణం కోసం భూమి కేటాయించండి
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి పెద్దఎత్తున తెలుగు భక్తులు అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తున్నారనీ, భక్తుల వసతుల కోసం అయోధ్య రామమందిరం సమీపంలో ప్రభుత్వ భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ని కోరారు,
ఈ భూమిలో తెలుగువారి దాతల సాయంతో భక్తుల కోసం వసతి సముదాయం నిర్మాణం చేస్తామని, అందులో భక్తులకు తక్కువ ఖర్చులో వసతి, భోజనం వంటి సౌకర్యాలు అందిఇస్తామని తెలిపారు. ఇది భక్తులకు ఆధ్యాత్మికంగా సంతృప్తిని కలిగించడమే కాకుండా, తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలను తీరుస్తుందని తెలిపారు.