రాజస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు
విజయనగరం పట్టణం రైల్వే స్టేషను రోడ్డులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న రాజస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 90 వేలు విలువైన గంజాయిని వన్ టౌన్ ఎస్ఐ నవీన్ పడాల్ మరియు టాక్ ఫోర్స్ ఎస్ఐ సాగర్ బాబు ఆధ్వర్యంలో పోలీసు బృందం స్వాధీనం చేసుకున్నట్లుగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి.వెంకటరావు తెలియజేశారు.
విజయనగరం వన్ టౌన్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ముందస్తు సమాచారంపై ఎస్ఐ లు నవీన్ పడాల్, సాగర్ బాబు మరియు పోలీసు బృందం రైల్వే స్టేషన్ రోడ్డులో స్వీట్ ఇండియాకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో వస్తుండగా, వారిని తనిఖీ చెయ్యగా, వారి బ్యాగుల్లో గంజాయిని గుర్తించారు. విచారణ చెయ్యగా వారిది రాజస్తాన్ రాష్ట్రం, జితేంద్ర సింగ్, బింజారాం అని, తాము కూలి పనులు చేస్తుంటామని, గంజాయి అలవాటు ఉండడంతో తక్కువ మొత్తంలో తమ అవసరాలు తీర్చుకుంటూ, మరికొంత అమ్ముకోవాలని ఉద్దేశ్యంతో సాలూరు వచ్చి, సాలూరులో 18కిలోల గంజాయిని కిలో ఒక్కింటిని రూ.2 వేలు కు కొనుగోలు చేసి, బస్సులో విజయనగరం వచ్చి, ట్రైన్ ఎక్కేందుకు గాను వెళ్తుండగా పోలీసులకు దొరికినట్లు గా తెలియజేశారు. నిందితుల వద్ద నుండి గంజాయిని డిప్యూటీ తాసిల్దార్ సమక్షంలో సీజ్ చేశామన్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ మార్కెట్ లో రూ. 90 వేలు ఉంటుందని, నిందితులను రిమాండ్ కు తరలించామని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి.వెంకటరావు తెలియజేశారు.