పార్వతీపురం మన్యం జిల్లా సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కల్పించవలసిన వసతులు పక్కాగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గరుగుబిల్లి మండలం ఉల్లి బద్ర ఉద్యాన కళాశాలలో నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ పివో లతో కలసి గురువారం పరిశీలించారు. ముందుగా ఉద్యాన కళాశాల మొదటి, రెండో అంతస్తు భవనాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికలతో పాటు అరకు పార్లమెంట్ నియోజక వర్గ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నందున అవసరమైన చర్యలు పక్కాగా తీసుకోవాలని సూచించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ప్రతీ నియోజక వర్గ ఈవియం లను భద్రపరిచేందుకు ఏర్పాటుచేసిన భవనం వద్ద రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈవియం లు తీసుకున్న తరువాత స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రిసెప్షన్ సెంటర్ వద్ద అవసరమైన బారికేడ్లను ఏర్పాటుచేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా ఈవియం ల తరలింపునకు పటిష్ట బందోబస్తు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లోపాలు తలెత్తకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేలా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు కల్పించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు పాలకొండ శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కల్పనా కుమారి , పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి. విష్ణు చరణ్ ,పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు పార్వతీపురం శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కె.హేమలత , పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు కురుపాం శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి వి వెంకట రమణ , జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి జి .కేశవ నాయుడు, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి డా, యం.వి. జి. కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.