తిరుమల తిరుపతి దేవస్థానంలో రథ సప్తమి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. రాత్రి వరకు ఈ వాహన సేవలు కొనసాగనున్నాయి.
ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య చిన్నశేష వాహనం, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారు అభయ ప్రదానం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు స్వామి వారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు.
వేడుకల నేపథ్యంలో మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగు రంగుల పుష్పాలంకరణలు చేశారు. ఇందుకోసం ఏడు టన్నుల సహజ పుష్పాలు, 50 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా, భద్రతా విభాగాలు, పోలీసు శాఖ భక్తుల భద్రత కోసం పటిష్ఠ చర్యలు చేపట్టాయి