హోరెత్తిన కూటమి అభ్యర్థుల ప్రచార ర్యాలీ
సాలూరు పట్టణం జనసంద్రంగా మారింది. ఎటు చూసినా తెదేపా జనసేన భాజపా జెండాలు పట్టి నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో కనిపించారు. పట్టణం పసుపు సంద్రముగా మారింది. గురువారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి నామినేషన్ మహోత్సవం నిర్వహించారు. ఎన్నికల అధికారికి నామ పత్రాన్ని సమర్పించి అనంతరం ఆమె నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మెంటాడ మండలాలతోపాటు పట్టణము నుంచి సుమారు 20వేల మంది కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బోసు బొమ్మ చిన్న బజారు ఎన్టీఆర్ కూడలి కోటవీధి పెద్ద కోమటిపేట డబ్బివీది మీదుగా తహసిల్దార్ కార్యాలయం కూడలికి ర్యాలీ చేరుకుంది. అక్కడ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సంధ్యారాణి, కొత్తపల్లి గీత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రానున్నది కూటమి ప్రభుత్వమే అని అన్నారు. కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వస్తున్న అనూహ్య స్పందన వైకాపా ఓటమికి నిదర్శనం అన్నారు. త్వరలో ప్రజలకు మంచి రోజులు రానున్నాయన్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో వేలాదిగా టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని నినాదాలు చేశారు. కార్యకర్తల నినాదాలతో పట్టణం హోరెత్తింది.