అమరావతి: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది.
రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటైన ఈ మంత్రివర్గ ఉప సంఘంలో రాష్ట్ర మానవ వరుల అభివృద్ది,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్,రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర,రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్,రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.
రాష్ట్రంలో గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై ఈ సబ్ కమిటీ తొలి సమావేశంలో చర్చించింది. అనంతరం నాల్గవ భవనంలో మీడియా సమావేశం నిర్వహించి సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనిత,సంధ్యారాణి వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నిశ్చయించారని తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్ణీత ప్రణాళిక ప్రకారం కృషి చేయవలసిన బాధ్యత మనపై ఉంది అని అన్నారు.
యువత మాదక ద్రవ్యాలకు బానిసైతే వారి భవిష్యత్తుకు, కుటుంబాలకు కూడా తీరని నష్టం జరుగుతుందని చెప్పారు.కావున గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియత్రించేందుకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనిత పేర్కొన్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గంజాయి పంటను నాశనం చేయడానికి గత రెండు సంవత్సరాలుగా సెబ్ కు ఎటువంటి అనుమతి ప్రభుత్వం ఇవ్వలేదని హోం మంత్రి అనిత చెప్పారు.
గంజాయి సాగుకు పెట్టుబడి పెట్టే,రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మత్తు పదార్థాలను అలవాటును నియంత్రించే డి-అడిక్షన్ కేంద్రాలు,పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాఠశాల దశ నుంచే విద్యార్దులకు గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో ఈ కేసుల్లో ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నవారిలో అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరమని హోంమంత్రి అనిత అన్నారు.గంజాయి సాగుకు పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు,డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన వారు ఎవరనే దానిపై నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముందుగా వంద రోజులలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని,గంజాయి సాగుపై సమాచారం ఇచ్చిన వారికి ప్రభుత్వం తరఫున తగిన బహుమతులు కూడా అందించనున్నట్టు మంత్రి అనిత పేర్కొన్నారు.
నిర్మూలన దీర్ఘకాల ప్రక్రియ – నియంత్రణ అత్యంత అవసరం అని గిరిజన సంక్షేమ,మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను గిరిజనులకు అర్ధం అయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన ఆ భూముల్లో కాఫీ,అల్లం, చింతపండు,పసుపు వంటి పంటలను మాత్రమే సాగు చేయాలని మంత్రి సంధ్యారాణి అన్నారు.
ప్రలోభాలకు గురైన గిరిజనులు గంజాయి సాగు చేయడానికి గత ప్రభుత్వం ఐటీడిఏలను నిర్వీర్యం చేయడం కూడా ఒక కారణమని మంత్రి పేర్కొన్నారు. గిరిజనులు
వారి పిల్లలను మంచి పౌరులుగా తయారు చేసెందుకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కావున తల్లి దండ్రులు పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పించాలని గిరిజన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పిల్లలు
గంజాయి బారినపడి ఉంటే ఎటువంటి భయం లేకుండా సంబంధిత అధికారులకు తెలియజేస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగు సహాయాన్ని అందించడం జరుగుతుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
ఈసమావేశంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ద్వారక తిరుమల రావు,సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పాల్గొన్నారు.