సాలూరు: వచ్చే ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదని భయపడుతూ జర్నలిస్టులపై మరియు ప్రతిపక్ష నేతలపై వైకాపా నేతలు అల్లరి మూకలతో దాడులు చేయిస్తున్నారని టిడిపి నేతలు సంధ్యారాణి, బంజు దేవ్ ఆరోపించారు. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ గురువారం సాలూరు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వైకాపా దాడులను ఖండిస్తూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న అవినీతి అక్రమాలను జర్నలిస్టులు బయటపెడుతున్నారని వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పి అభివృద్ధిని ఆకాంక్షించే తెదేపా జనసేన ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు అంత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సాలూరు, పాచిపెంట తెదేపా అధ్యక్షులు ఎన్. తిరుపతిరావు, పరమేశు, ప్రసాద్ బాబు, రమణ, జనసేన నాయకులు శివ కృష్ణ, గొర్లె జగదీష్ తదితరులు పాల్గొన్నారు.