సాలూరు: ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరినట్లు ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర అన్నారు. గురువారం పట్టణంలోని మెంటాడ వీధి కోదండరామ కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. హాజరైన మంత్రి పార్టీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తే సంతోషిస్తానన్నారు. ఎందుకంటే ఆరోగ్యం సహకరించకపోవడం, భార్య పిల్లలను చూసుకునేందుకు సమయం ఉండకపోవడంతో ఎంపీగా పోటీ చేస్తే సమయం ఉంటుందని సీఎంను కోరినట్లు చెప్పారు. ఇప్పటికే నాలుగు సార్లు ప్రజాభిమానంతో ఎమ్మెల్యేగా గెలుపొందాను. వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి నియోజకవర్గం అభివృద్ధి చేశాను అన్నారు. తాను ఎంపీగా వెళ్ళినా.. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరిదీ అన్నారు. ఆయన మళ్లీ సీఎం అయితేనే పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. నాకు ఎంపీగా సీటు ఇవ్వాలని కోరాను కానీ ఆయన ఏ నిర్ణయం ప్రకటించినా శిరసావహిస్తానన్నారు. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలు కొనసాగాలంటే జగన్ మళ్ళీ సీఎం కావాలన్నారు. ఆయనను గెలిపించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, వైకాపా నేతలు, గ్రంథాలయ సంస్థ సభ్యురాలు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.