ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. పూసపాటిరేగ మండలం కొవ్వాడ గ్రామంలో నిర్వహించిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో 100కు పైగా చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు రూ.3 వేలు నుండి 4 వేల రూపాయలకు పెంచిందని, 2024 ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను జూలై నెలలో 7వేల చొప్పున లబ్ధిదారులకు అందించామని వివరించారు. అదేవిధంగా అంగవైకల్యం కలవారికి, బెడ్ రిడెన్ వారికి రూ .15 వేల వరకు పింఛను పెంపు చేయడం జరిగిందని, ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించి బడుగు బలహీన శ్రామిక వర్గాలకు రూ. 5 కే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం అందిస్తోందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా ఇచ్చిందన్నారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ మెగా డీఎస్సీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి మొదట సంతకం చేశారని గుర్తు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ..ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను గోడకు అతికించారు. కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు గారితో పాటు కూటమి ప్రభుత్వం నాయకులు మరియు క్లస్టర్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.