భక్తిశ్రద్ధలతో హోమాలు, పారాయణం, పూజలు
పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు విష్ణు సహస్ర పారాయణం చేశారు. లోక కళ్యాణార్థం, ఏడాది పొడవున నిర్వహించే పూజా కార్యక్రమంలో దోష పరిహారం కోసం ప్రాయశ్చిత్త పూజలు ఘనంగా నిర్వహించారు. రమా సత్యనారాయణ స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మికి పవిత్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు.. మహా పూర్ణాహుతి, మంగళ శాసనంతో ఉత్సవాలను ముగించారు. పూజా కార్యక్రమాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.