రేషన్ డిపోలకు బియ్యంతో పాటు ఇతర సరకులన్నీ ఒకేసారి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక అధికారులకు ఆదేశించారు. శనివారం సాలూరు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్ని రేషన్ డిపోలకు సరకులు చేరవేశారని సిఎస్ డిటి రంగారావును ప్రశ్నించారు. డిపోలకు పంపించే సరకులు వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎన్ని రేషన్ డిపోల వద్ద డీలర్ల సమస్య ఉందని అడిగారు. సమస్యలు ఉన్నచోట తక్షణమే పరిష్కరించి లబ్ధిదారులకు రేషన్ సరకులు సక్రమంగా అందించాలన్నారు. అనంతరం ఎం ఎల్ ఎస్ గోదామును పరిశీలించారు. సరుకుల వివరాలను ఇన్చార్జిను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివరాంపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో తేమశాతం పరిశీలించి ఎప్పటికప్పుడు రైతులకు బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని తహసిల్దార్ ఎన్వి రమణ, డిటి రంగారావుకు సూచించారు.