డోకి శీల అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్య అందించాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు. పార్వతీపురం మండలం డోకిశీల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం లోని పిల్లలకు సంబందించిన మందులను, శానిటైజేషన్ సంబంధించిన సామాగ్రి స్టాక్ ను పరిశీలించారు. కేంద్రంలోని హాజరుపట్టీని, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించి నిల్వ ఉన్న గ్రుడ్లు, బియ్యం, పప్పు ఇతర సామగ్రిపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్థలాభావాన్ని బట్టి పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉన్నట్టు పార్క్ ను ఏర్పాటు చేయాలన్నాడు. పిల్లల బరువు, ఎత్తులను గురించి ఆరా తీసిన ఆయన ప్రతి రోజూ పిల్లల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. కేంద్రానికి పిల్లలందరూ హాజరయ్యేలా చూడాలని,. పిల్లలతో కాసేపు ముచ్చటించి, పౌష్టికాహారం తీసుకున్న పిల్లల్లో వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండేలా చూడాలని, ఆహారం తీసుకునే విధానం పట్ల తల్లితండ్రులకు అవగాహనా కల్పించాలని చెప్పారు. చిన్నారులు చదువు పట్ల ఆసక్తి చూపేలా అంగన్వాడి కేంద్రాల్లోనే సరైన బీజం పడాలని కలెక్టర్ అన్నారు. చిన్నారులకు ఆట, పాట కూడినవవిద్యా బోధన చేయాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సామూహిక సీమంతం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిఆర్డిఎ పీడీ వై.సత్యంనాయుడు,డిఎల్డిఓ రమేష్ రమణ, తహసీల్దార్ వై.జయలక్ష్మి, యంపిడిఓ రూపేష్ కుమార్, సీడిపిఓ శ్రీనివాస రావు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.