అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిశోర్
ఎస్టీ ఏరియాలో మద్యం షాపులు స్థానిక గిరిజనులకే తొలి ప్రాధాన్యత అని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిశోర్ గురువారం తెలిపారు. నూతన మద్యం పాలసీలో భాగంగా షెడ్యూల్డ్ ఏరియాలోని మద్యం షాపులకు ప్రభుత్వం విధి విధానాలను, మార్గ దర్శకాలను జారీచేసిందని చెప్పారు. షెడ్యూల్డ్ ఏరియా కింద నోటిఫై చేయబడిన మండలాల్లోని షాపులకు స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులని చెప్పారు. స్థానిక గిరిజనులు దరఖాస్తు చేయని ఎడల స్థానికేతర గిరిజనులకు అవకాశం కల్పిస్తాం అన్నారు. మండలంలో కొన్ని గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా కింద నోటిఫై చేయబడి మిగతా గ్రామాలు మైదాన ప్రాంతానికి చెంది ఉన్నట్లయితే అట్టి మండలంలోని షాపు గిరిజనేతర వ్యక్తికి లాటరీలో కేటాయించబడి నట్లయితే ఆ వ్యక్తి తన షాపును మైదాన ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఒకవేళ గిరిజన వ్యక్తికి లాటరీలో షాపు కేటాయించబడితే అతను తనకు నచ్చిన చోట షాపును ఏర్పాటు చేసుకోవచ్చుని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ ఏరియాకి చెందిన గ్రామాల్లో షాపును ఏర్పాటు చేయుటకు ఆ సంబంధిత గ్రామసభ తీర్మానం తప్పనిసరి అని చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించిన షెడ్యూల్ ప్రాంతాలకు చెందిన గిరిజనులు స్థానిక ఎస్.టి సర్టిఫికేట్, ఎంట్రీ పాసులతో ఈ నెల 14వ తేదీన యం.ఎ. నాయుడు కన్వెన్షన్ హాల్‌కు తప్పక హాజరుకావాలని కోరారు.