జిల్లాలో అధికారులందరూ అందుబాటులో ఉండాలి
జాయింట్ కలెక్టర్ శోభిక ఆదేశం
ఉత్తరాంధ్రలో తుఫాను నేపథ్యంలో ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున అందరూ అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అనంతరం ఈ మేరకు ఆమె ఆదేశాలు జారీచేశారు. అధికారులు ప్రధాన కేంద్రం లోనే అందుబాటులో ఉండాలని, ఎవరికీ ఎటువంటి సెలవులు మంజూరు కాబడవని ఆమె స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అనుమతితో మాత్రమే ప్రధాన కేంద్రం విడిచివెళ్లాలని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా రెవిన్యూ, నీటి పారుదల, గ్రామీణ నీటిసరఫరా, వైద్య ఆరోగ్యం, పంచాయతీ, డ్వామా, వ్యవసాయం -అనుబంధ శాఖలు, పోలీస్ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. కేశవ నాయుడు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.