అన్ని మండలాల్లో 15 రోజుల్లో పిఎంఈజిపి యూనిట్లు ప్రారంభించండి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం జిల్లాలో పిఎంఈజిపి ( ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ) కింద ప్రతి మండలంలో ఒక యూనిట్ ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రానున్న 15 రోజుల్లో యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. స్థిర ఆదాయం వచ్చే నూతన యూనిట్లను స్థాపించి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలని అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లాలో జీవనోపాధులపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఎంఈజిపి కార్యక్రమం ద్వారా జిల్లాలో అవసరమైన కొత్త యూనిట్ల స్థాపనకు అధికారులు కృషి చేయాలని అన్నారు. స్థిర ఆదాయం వచ్చే వ్యాపారాలపై దృష్టి సారించాలని, యూనిట్ల స్థాపనకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పించి, నవంబర్ 17 నాటికి ప్రారంభం కావాలని కలెక్టర్ ఉద్బోదించారు.
జిల్లాలో విడివికెలు(వన్ ధన్ వికాస కేంద్రాలు ) బాగా పనిచేసేలా మంచి వాతావరణం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. సీతంపేట ప్రాంతంలోని అన్ని విడివికెలు నడవాలని, ఆ దిశగా ఏపీఎంలు చొరవ చూపాలని అన్నారు. కేవలం ఒక్క సీజనుకే పరిమితం కాకుండా ప్రతి రోజూ విడివికెల నుంచి వస్తువులు ఉత్పత్తి కావాలని ఆకాంక్షించారు. విడివికేలు ఉత్పత్తి చేసే వస్తువులకు ఆకర్షనీయమైన ప్యాకింగ్, డిజైన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని విడివికేల నుంచి ఉత్పత్తి అయ్యే వాటికి ఒకే రకమైన ప్యాకింగ్ ఉండాలని, ఇందులో పనిచేసే వారికి గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
పశు సంవర్ధక శాఖ ద్వారా గొర్రెలు పెంపకం యూనిట్లను స్థాపించాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే నెల 17వ తేదీ నాటికి 500 కుటుంబాలలో గొర్రెలు పెంపకం యూనిట్లు ప్రారంభం కావాలన్నారు. చేనేత, జౌళి శాఖ ద్వారా సమత కార్యక్రమం కింద శిక్షణ ఇవ్వాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ సంస్థ ద్వారా జిల్లాలోని యువతకు అవసరమైన శిక్షణను ఇచ్చి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటిడిఏ ఏపీఓ, డిఆర్డిఏ, మెప్మా, పరిశ్రమలు, చేనేత, పశు సంవర్ధక, జీసిసి, నాబార్డ్ నుంచి అధికార ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.