ఉల్లాస్ తో అక్షరాస్యత శాతం పెరగాలి

లక్ష్యాలు సాధించాలి..జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమం కింద ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వయోజన విద్య నోడల్ అధికారిని ఆదేశించారు. వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. జిల్లాలో 23 వేల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. ఇందుకోసం మండల, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులని నియమించి,  సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇచ్చిన లక్ష్యాలలో అన్ని మండలాలకు ప్రాతినిద్యం ఇవ్వాలని సూచించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రచురించబడే పుస్తకాలు మండల, జిల్లాస్థాయిలో సరఫరా చేయబడతాయని, అందులోని పాఠాలను నిరక్షరాస్యులకు బోధించి, ప్రాథమిక అవగాహన పెంచాలని కలెక్టర్ హితవు పలికారు. జిల్లాలో 53 శాతంగా ఉన్న అక్షరాస్యత, ఈ కార్యక్రమం ద్వారా మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా అవగాహన పెంచుకున్న వారందరికీ చివరి రోజున సర్టిఫికెట్, పతకాలు వంటివి బహూకరించి ప్రోత్సాహించాలని పేర్కొన్నారు. జిల్లాలో నిర్దేశించిన ఉల్లాస్ కార్యక్రమ లక్ష్యాలు సాధించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. సమావేశంలో వయోజన విద్య నోడల్ అధికారి టి.వైకుంఠరావు, డిఆర్డిఎ, డ్వామా పీడీలు వై. సత్యం నాయుడు, రామచంద్రరావు, సీడీపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *