నవంబరు 1 నుంచి అవ్వా తాతలకు కంటి పరీక్షలు

సచివాలయాల వారీగా సమన్వయంతో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించండి

జిల్లా కలెక్టర్ శ్యామ్  ప్రసాద్

విద్య వైద్య శిశు సంక్షేమ అంధత్వ నివారణ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లాలోని ప్రతీ గ్రామ సచివాలయం పరిధిలోని అరవై ఏళ్ళ పైబడిన అవ్వా, తాతలకు కంటి చూపు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్  అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, విద్యా శాఖ అధికారులతో పాఠశాల విద్యార్థులకు కంటి చూపు పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం శుక్రవారం జరిగింది.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్రామ సచివాలయం పరిధిలోని నిర్వహించనున్న కంటి వైద్య పరీక్షల శిబిరం సమయాన్ని  ముందుగా ప్రజలకు తెలియజేయాలన్నారు. స్క్రీనింగ్ పరీక్షల  అనంతరం అవసరమైతే అవ్వా, తాతలకు  కళ్ళ అద్దాలు, అంతర్ సుకుసుమం(కేటరాక్ట్), కొయ్య కొండ(టెరిజియం) వంటి శస్త్ర చికిత్సలు చేయించాల్సి  వస్తె వారికి ప్రభుత్వం  ఉచితంగా చేస్తుందన్నారు. అధికారులు సమన్వయంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల, ప్రయివేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంతో విస్తృతంగా కంటి చూపు స్క్రీనింగ్ పరీక్షలు జరగాలని అన్నారు.
గత ఆగస్టు నెల నుంచి మూడు నెలల పాటు ప్రభుత్వ పాఠశాల, ఎయిడెడ్ పాఠశాలల్లో జిల్లా అందత్వనివారణ సంస్థ, జిల్లా విద్యా శాఖ అధికారులు సంయుక్తంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న  కంటి చూపు స్క్రీనింగ్ పరీక్షలు 260 పాఠశాలల్లో పూర్తి అయినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి జి.పడాలమ్మ  కలెక్టర్ కు తెలిపారు. 52, 132 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 16035 మంది విద్యార్థులకు కళ్ళ అద్దాలు అందజేయాల్సి ఉందని వివరించారు. విద్యార్థుల్లో రక్తహీనత సమస్య ఉన్న వారిని గుర్తించి ఆరోగ్య పర్యవేక్షణకు సులభంగా ఉండే విధంగా నమోదు కొరకు కార్డులను అందజేయాలన్నారు. ఐరన్ లోపం ఉన్నవారికి పోలిక్ మాత్రలను అందజేయాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా, వాగ్దేవి,  డా, వినోద్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఎమ్.ఎన్.రాణి, జిల్లా అందత్వ నివారణ అధికారి డా,సుకుమార్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *