జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్
తుఫాను వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు 23 నుండి 26వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో తుఫాను మూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల పరిస్థితిని గమనించాలని చెప్పారు. వసతి గృహాలను తనిఖీ చేయాలని, శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవరూ ఉండరాదని ఆయన ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు యిబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని ఆయన తెలిపారు. అటువంటి ప్రదేశాల్లో సిబ్బందిని ఏర్పాటు చేయడం, సూచనల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. విపత్తులు సంభవించే అవాశాలు ఉన్న ప్రదేశాలు వద్ద పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. విపత్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. గెడ్డలు, వాగులు, వంకలు పొంగే ప్రదేశాలు ఉంటాయని, ఆకస్మికంగా వరదలు వచ్చే సమయంలో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురి అవుతారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ప్రదేశాల్లో పోలీసు, వాలంటీర్లు లేదా ఇతరులను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారించాలని అన్నారు. గతంలో జరిగిన విపత్తుల పరిస్థితిని గ్రామాల్లో తెలుసుకుని పక్కా ప్రణాళికలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు. గత అనుభవాల దృష్ట్యా అన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రహదారులపై ఉన్న పెద్ద గతకల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అటువంటి చోట్ల నీరు నిల్వ ఉండకుండా చూదాలని ఆయన ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, స్లాబ్ లు పడిపోయే అవకాశం ఉన్న భవనాలు, మట్టి ఇళ్లులో ఉన్న వాటిని సురక్షిత భవనాల్లోకి మార్చాలని ఆయన ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్ హెచ్పి, సీహెచ్ డబ్ల్యులతో సహా ఎవరూ ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని ఆయన ఆదేశించారు.