పి.కోనవలసలో కలెక్టర్ పల్లె నిద్ర

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

పల్లె నిద్రలో భాగంగా పాచిపెంట మండలం పి.కోనవలసలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ గురువారం సందర్శించారు.

జిల్లాలోని  గిరిజన, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల శాఖల ఆధ్వర్యంలో గల అన్ని ఎస్.సీ, ఎస్.టీ,బీసీ వసతి గృహాలను బలోపేతం చేసేందుకు జిల్లా కలెక్టర్ *పల్లె నిద్ర* కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఈ కార్యక్రమాన్ని పి.కోనవలసలో కలెక్టర్ శ్రీకారం చుట్టగా, ఏకకాలంలో జిల్లా అధికారులందరూ 30 వసతి గృహాల్లోని పలు ప్రాధాన్యత అంశాలను పరిశీలించి, అక్కడే రాత్రికి బస చేసి, సమస్యలు తెలుసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపనున్నారు.

ఈ సందర్బంగా వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ అందుతున్న విద్యా ప్రమాణాలు, నాణ్యమైన పోషకాహారం, వైద్య సదుపాయాలు, పారిశుధ్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, కిచెన్ గార్డెన్, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే నిర్భయంగా తమకు తెలియజేయాలని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాత్రికి విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని రుచి చూసి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల చదువు సమయంలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన ఆయన పాఠ్యంశంలోని పలు ప్రశ్నలు వేసి సమాధానాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ సబ్జెక్టులలో వెనుకబడిన వారిని గుర్తించి, వారికీ అర్ధమయ్యేలా బోధించాలని ఈ సందర్బంగా ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి మంచిగా చదివి ఉత్తమ ఫలితాలను సాధించేలా తీర్చిదిద్దాలని కోరారు. విద్యను చక్కగా నేర్చుకునేందుకు సంపూర్ణ ఆరోగ్యం అవసరమన్నారు. పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారం విద్యార్థులు తీసుకొనేలా న్యూట్రీ గార్డెన్లను ప్రోత్సహిస్తూ, వాటిని విద్యార్థులు ఆహారంలో  తీసుకునేలా చేస్తున్నట్లు చెప్పారు. సరైన పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, పరిసరాలు పరిశుభ్రతతో వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని, ఆ విదంగా వసతి గృహాలను ఉంచాలని వార్డెన్ ను కలెక్టర్ ఆదేశించారు.

వసతి గృహాల పర్యవేక్షణ పెంచుతామని, జిల్లా లోని అన్ని సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తామన్నారు. విద్యార్థుల జ్వర బాధితుల ను , రక్త పరీక్షలు నిర్వహించిన రికార్డులను నిశితంగా కలెక్టర్ పరిశీలించారు.అందుబాటులో ఉన్న మందులను యాంటీబయటిక్ మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు బంగారు భవిత కార్డులను జారీ చేసి తరగతి గదిలోని ప్రగతి, ఆరోగ్య పరీక్షల వివరాలను పొందుపరుస్తామన్నారు.
తదుపరి అదే వసతి గృహంలో కలెక్టర్ బస చేశారు.

విద్యార్థులకు బంగారు భవిత కార్డులను ఇస్తున్నామని, ఇందులో విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వైద్య పరీక్షల వివరాలు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

వసతి గృహంలోని విద్యార్థులకు అన్ని విధాల పర్యవేక్షించడం జరుగుతుందని, అయినప్పటికీ మరణాలు సంభవిస్తున్నట్లు వార్తలు వింటున్నామని తెలిపారు. ఇందుకు వసతి గృహాల సెలవుల రోజుల్లో తమ సొంత గృహాలకు వెల్లి, అక్కడ కలుషిత నీటిని సేవించడం వలన, వ్యాధులకు గురైనప్పటికీ గుర్తించక పోవడం, తెలుసుకొని నాటు, సొంత వైద్యాన్ని చేసుకొని వసతి గృహాలకు రావడం వలన, విషయాన్ని వార్డెన్లకు వివరించక ప్రాణాపాయ పరిస్థితికి గురవుతున్నారని కలెక్టర్ గుర్తుచేశారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే విద్యార్థులు వసతి గృహ వార్డెన్ కు తెలియజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ చలపతిరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కే శ్రీనివాసరావు, తహసిల్దార్ డి. రవి, ఎంపీడీవో జనార్ధన రావు, ప్రిన్సిపాల్ పి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *