దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన ఆస్తులు క్రయవిక్రయాలు జరిగి సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ శాఖ అధికారులు కళ్ళు తెరిచారు అనడానికి సాలూరు పట్టణంలో జరిగిన సంఘటనే నిదర్శనం.
పట్టణంలోని సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన శ్రీ వెంకటేశ్వర డీలక్స్ సినిమా హాలు మరియు పక్కనున్న మోటర్ మెకానికల్ షెడ్లు ఖాళీ స్థలము దేవాదాయ శాఖ కు చెందినదని, కాదు రాజులకు చెందినదని గత కొన్నాళ్లుగా కోర్టు వివాదం సాగుతోంది.
కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దేవాదాయ శాఖ చెందిన ఆ స్థలంపై కన్నేశారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి స్థలాన్ని తమ పేరున రిజిస్ట్రేషన్ కూడా జరిపించుకున్నారు. ఈ తతంగం అంతా దేవాదాయ శాఖ అధికారులు దృష్టిలో ఉన్నప్పటికీ నిలువరించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సినిమా ధియేటర్ను పడగొట్టి స్థలాన్ని చదును చేసి వారి ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధపడుతున్న సమయంలో దేవాదాయ శాఖ అధికారులు ఈ స్థలం మాదే అంటూ నోటీసు బోర్డులు పెట్టడం విశేషం.
ఈ విషయం పై పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు కళ్ళు మూసుకుని ఉన్నారా కోట్లు విలువచేసే స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసి తమ పేరున మున్సిపాలిటీలో కూడా పేర్లు మార్పు చేసినప్పుడు కూడా ఎందుకు అడ్డుకోలేదని చర్చించుకుంటున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారినప్పుడు పట్టించుకోని ఎండోమెంట్ అధికారులు ఇప్పుడు కళ్లు తెరిచారా అని విమర్శలు గుప్పిస్తున్నారు.
తలా పాపం.. తిలా పిడికెడు
దేవదాయ శాఖ స్థలం అని ఆ శాఖ అధికారులు నోటీస్ బోర్డులు పెట్టడమే కాకుండా.. గతంలో పురపాలిక అధికారులకు ఆ స్థలం ఎండోమెంట్ దే అని అభ్యంతరాలు తెలియజేస్తూ నోటీసులు జారీ చేశారు. వీటిపై ఎటువంటి విచారణ జరపని మున్సిపల్ అధికారులు దేవాదాయ శాఖ అధికారులతో చర్చించకుండానే కోర్టు ఆదేశాలు ఉన్నాయనే నెపంతో దేవాదాయ శాఖ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పేరున మార్చేశారు. పేరు మార్పు చేసేందుకు లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేయడమే కాకుండా సరైన పద్ధతిలో అధికారులు పనులు చేయలేదని విజిలెన్స్ కమిషనర్ కూడా ఫిర్యాదులు చేశారు. తలా పాపం తిలా పిడికెడు అన్న చందంగా దేవాదాయ శాఖ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పేరున మార్పు చేసిన ఘనత మున్సిపల్ అధికారులకు దక్కిందని, ఆ స్థలంలో ప్రస్తుతం ఎండోమెంట్ అధికారులు పెట్టిన నోటీసు బోర్డులే చెబుతున్నాయి. అయితే గతంలో కూడా దేవాదాయ శాఖ భూములు కొంతమంది వ్యక్తులు అన్యాక్రాంతం చేసినప్పుడు హెచ్చరిక బోర్డులు పెట్టి దేవాదాయశాఖ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.