సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అయింది..
ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు
కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం
పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి మాటల గారడీతో మోసం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో వైకాపా నేతలతో సమావేశం అయ్యారు. మంత్రి లోకేష్ పేరుతో వైన్, మైన్, శాండ్ మాఫియాతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పెత్తనం చెలాయిస్తున్నట్లు మీ పచ్చ పత్రికలే రాస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో తప్పుడు హామీలు ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, పల్లె పండగ పెద్ద దండగ అన్నారు. వర్క్ ఆర్డర్లు ఇవ్వకుండా శంకుస్థాపనలు ఏంటని ప్రశ్నించారు? గతంలో వందల కోట్ల రూపాయలతో మంజూరు చేసిన పనులు ఒకటి జరిపించలేదన్నారు. మక్కువ రోడ్డు శివరాంపురం వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేయించాను కానీ ఇప్పటివరకు ఆ పనులు ఎందుకు ప్రారంభించ లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సామాజిక మరుగుదొడ్లు, తాగునీటి పథకం పనులు జరిపిస్తాం అని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఇప్పటివరకు ఎన్ని పనులు జరిపించారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు అందలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు. మాటల గారడీతో ప్రజలను మోసం చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. మద్యం షాపులకు లాటరీ ద్వారా ఎంపిక చేశారు. టిడిపి నేతలకే వైన్ షాపులు దక్కాయి. అవన్నీ ఎలా వచ్చాయో వాళ్లకే తెలియాలన్నారు. జీవో నెంబర్ 3 అమలు, షెడ్యూల్ గ్రామాల ప్రకటన ఎప్పుడు చేస్తారో గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి వారికి గిరిజన శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పాస్ పుస్తకాలపై సీఎం చిత్రం ఉందన్నారు. మరి ఇప్పుడు రెవెన్యూ మంత్రి, సీఎం చిత్రాలు కూడా రైతుల భూమి పత్రాలపై వేసుకుంటున్నారు. మరి ఇది తప్పు కాదా అని ప్రశ్నించారు. ఐ టి డి ఏ కు పిఓ నియామకం చేసుకోలేదు. డిడిని ఎందుకు సరెండర్ చేశారు ఏ కారణంతో చేసారో చెప్పలేదన్నారు. శ్యామలాంబ పండగ నిర్వహణకు ప్రభుత్వం నుంచి మంత్రి నిధులు మంజూరు చేయాలన్నారు. అంతేకానీ చందాలు వసూలు చేసి చేయడం సరికాదన్నారు. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న శ్యామలాంబ ఆలయం అభివృద్ధి, పండగకు నిధులు ప్రభుత్వమే కేటాయించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కరించేంతవరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు గొర్ల వెంకటరమణ గిరి రఘు, సింగారపు ఈశ్వరరావు, వైకాపా నేతలు దండి శ్రీను మజ్జి అప్పారావు, కస్తూరి రామకృష్ణ కొల్లి రమణ, అబ్దుల్, హరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.