ఉచిత ఇసుక విధానంపై మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం
ఇసుక అక్రమాలపై కలెక్టర్ ఎస్పీ గనుల శాఖ ఏడికి లేఖలు రాస్తా: దొర
ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఇసుక ట్రాక్టర్ల పై కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. అధికార పార్టీ నేతలు అక్రమ ఇసుక దందా సాగిస్తున్నా అధికారులు కళ్ళు మూసుకుంటున్నారని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరులతో సమావేశమయ్యారు. ఇసుక అక్రమ రవాణా, కూటమి నేతల దందాపై పచ్చ పత్రికలలో ఎక్కువగా కథనాలు వస్తున్నాయి అని పత్రికలు చూపించారు. సీఎం చంద్రబాబు ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామంటున్నారు. సొంతానికి ఇసుక ఎక్కడి నుంచైనా తరలించుకోవచ్చని సీఎం చెబుతున్నారు. అధికారులు మాత్రం ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని కేసులు పెడుతున్నారన్నారు. తరలిస్తున్న ఇసుక సొంతానిక కాదా అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. ఇటీవల ఇసుక తరలిస్తున్న అధికార పార్టీకి చెందిన నేత ట్రాక్టర్ రెవిన్యూ అధికారులు పట్టుకొని కార్యాలయంలో పెట్టి మళ్ళీ ఎందుకు వదిలేశారో చెప్పాలన్నారు. సాలూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన వైకాపా నేత జరజాపు మోహన్ ట్రాక్టర్ ఇసుక తరలిస్తున్నారని కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఉచిత ఇసుకపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేస్తారా.? కూటమి నేతలు చెప్పిన నిబంధనలు పాటిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భవనాలు రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి పనులకు ఇసుక ఎంత సరఫరా చేశారు. ఆర్టీఐ ద్వారా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమాచారం తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక విధానంపై జిల్లా కలెక్టర్ ఎస్పీ గనుల శాఖ ఏడికి లేఖలు రాస్తానని రాజన్న దొర చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, గిరి రఘు, గొర్ల వెంకటరమణ, కస్తూరి రామకృష్ణ, మజ్జి అప్పారావు, పిరిడి రామకృష్ణ, చిన్ని తదితరులు పాల్గొన్నారు.