నెలకు రూ. 2.33 నుంచి 3.26 లక్షల జీతం
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికృష్ణ చైతన్య
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మన్ భాషా శిక్షణ, ఉపాధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. క్యూరా పర్సనల్ భాగస్వామ్యంతో జర్మనీలో పని చేయాలనుకునే నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషా శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులు జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేసి, 35 ఏళ్ల లోపు వయసు గలవారై ఉండాలన్నారు. కనీసం 2 ఏళ్ల బిఎస్సీ అనుభవం లేదా 3 ఏళ్ల జీఎన్ఎం అనుభవం అవసరమని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఆరు మాసాల పాటు తిరుపతిలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఇందులో జర్మన్ భాషా కోర్సులు A1, A2, B1, B2 స్థాయిలలో నేర్పబడతాయని, అభ్యర్థులు జర్మనీలో పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రాథమిక అర్హత పరీక్ష ద్వారా జరుగుతుందని, ఈ పరీక్షలో ఇంగ్లీష్, డిజిటల్ స్కిల్స్, జ్ఞాన పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. వీసా పొందిన తర్వాత అభ్యర్థులు రూ. 75 వేలు డిపాజిట్ చెల్లించాల్సిఉంటుందని, ఇది తిరిగి చెల్లించబడుతుందని వివరించారు. అభ్యర్థులు రెసిడెన్షియల్ లేదా డే స్కాలర్స్ విధానంలో శిక్షణ పొందవచ్చని, ఈ శిక్షణలో ఆహారం, వసతి ఖర్చులు అభ్యర్థులే భరించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. వీసా పొందిన తర్వాత అభ్యర్థులు జర్మనీలో నెలకి రూ. 2,33,000 నుంచి రూ. 3,26,000 వరకు జీతం పొందే అవకాశం ఉంటుందని, ఈనెల 14వ తేదీన క్లాసులు ప్రారంభమవుతాయని అన్నారు. 15వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అభ్యర్థులు తమ బయోడేటా, అవసరమైన సర్టిఫికెట్లు పంపించాలని, మరిన్ని వివరాలకు 96769 65949 నంబరును సంప్రదించవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.