పార్వతీపురం ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ
జిల్లాలోని గిరిజనులకు అన్ని విధాలా అండగా ఉంటాం. వారికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తామని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. కురుపాం మండలం చింతమానుగూడ గ్రామంలో ఏర్పాటుచేసిన ఆదివాసీ క్రిష్ణారావు మెమోరియల్ కళాక్షేత్రం, మినీ మ్యూజియం,మంత్రజోల గ్రామంలో పొడి వన్ ధన్ వికాస కేంద్రం ద్వారా చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని మంగళవారం పీఓ ప్రారంభించారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ నాగరికతకు మారుపేరు గిరిజనులని, అటువంటి గిరిజనులు ఉపయోగించే వస్తు సామాగ్రిని, పరికరాలను ఒక చోట చేర్చడం అభినందనీయం అన్నారు. ఇది కేవలం మినీ మ్యూజియం మాత్రమే కాదని, భావితరాలకు అపురూప కానుకని కితాబిచ్చారు. ఈ మ్యూజియంలోని అలనాటి వస్తువుల జ్ఞాపకాలు అందరి మదిలో మెదులుతాయని పేర్కొన్నారు. అలాగే కళాజాతల్లో గిరిజనుల నృత్యాలు ప్రత్యేకం, అందులో థింసా నృత్యం ఎంతో ప్రత్యేకత సంతరించుకుందని గుర్తు చేశారు. ఇటువంటి గిరిజన కళాజాతలను ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో వినియోగించుకోవడం జరుగుతుంది అన్నారు. ఇలాంటి కళాజాతలను ప్రదర్శించేందుకు వీలుగా కళాక్షేత్రం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రజోలలో పొడి వన్ ధన్ వికాస కేంద్రం ఏర్పాటుచేసిన చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని సందర్శించి తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రతి మండలంలో మోడల్ వికాస కేంద్రం ఉండాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షిస్తున్నారని, ఆ దిశగా వన్ ధన్ వికాస కేంద్రాలు వృద్ధి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీలు, ఏపీఎంలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.