పార్వతీపురం మన్యం జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా తమర్భ కొండలరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పంచాయతీలు పారిశుధ్య నిర్వహణ, తాగునీరు సరఫరా తదితర అంశాలలో ఆదర్శంగా నిలిచి అవార్డులు అందుకునే దశలో ఉండాలన్నారు. స్వచ్ఛ సుందర పార్వతీపురంలో భాగంగా ప్రతి పంచాయతీలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనాలని ఆయన చెప్పారు. కొండల రావు అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా పనిచేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. అంతకముందు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో డివిజనల్ పంచాయతీ అధికారిగా, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి విస్తరణ అధికారిగా పలు హోదాల్లో పనిచేశారు.