పెదపథంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి
భాజా భజంత్రీలు నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు
ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని రాష్ట్రంలో 40 ఆరోగ్య ఉప కేంద్ర భవనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారని, మన్యం జిల్లాకు 8 రాగా, నియోజకవర్గానికి 4 మంజూరు అయ్యాయని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు. పెదపథం పంచాయతీకి రోడ్లు, అంగన్ వాడీ భవనాలు, ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసి, జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యత మీదే అని అన్నారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు. సాగు, తాగు నీరు అందిస్తాం అని మంత్రి హామీ ఇచ్చారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పెదపథం పంచాయతీలో ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి శుక్రవారం మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ద్వారా మంజూరు అయిన రూ. 55 లక్షలతో పనులు సకాలంలో పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తాం అని ఐటీడీఏ డీఈ మణికుమార్ మంత్రి కి తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, సర్పంచ్ సుకన్య, మత్స శ్యామ్,రామసాయి, టిడిపి అధ్యక్షులు చిట్టి, పరమేశు, గుళ్ల వేణు,రమాదేవి,మరిపి సింహాచలం, లక్ష్మీ, ఎంపీడీవో పార్వతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.