సాయం అనే మాటకు అర్థం తెలియని మాజీ సీఎం జగన్, వైకాపా నేతలు, ప్రభుత్వంపై బురదజల్లేందుకు తప్పుడు ప్రచారం, విమర్శలు చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మే పార్టీ టిడిపి అన్నారు. వరదలు కారణంగా విజయవాడలో 7600 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లగా నాలుగు లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో వేసి కూటమి ప్రభుత్వం ఆదుకుందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నవారికి 25 వేలు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వారికి పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే అన్నారు. పంట నష్ట పరిహారం కూడా హెట్టార్కు 25 వేల రూపాయలు చొప్పున అందించమన్నారు. వరదల కారణంగా నీటిలో మునిగిపోయిన విద్యుత్ సామాగ్రి కార్లు బైకులు రిపేర్లు చేయించామన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో రాష్ట్రం తో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాదిమంది వరద బాధితుల కోసం ఆర్థిక సాయం అందించారన్నారు. నమ్మకానికి మరో పేరు చంద్రబాబు అని ప్రజలకి తెలుసని, వైకాపా ఫేక్ గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొడుతున్నారన్నారు. తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారం దక్కించుకొని రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసి వైకాపాకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఎప్పటికైనా మీలో మార్పు రాకుంటే వచ్చే ఎన్నికల్లో వైకాపాను ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమన్నారు.