రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక కొందరు సోషల్ మీడియాలో నాపై, నా కుటుంబ సభ్యులపై, అనుచరులపై విష ప్రచారం చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో మంత్రి కార్యాలయంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ..
గత నెల 29న నా కుమారుడు పుట్టినరోజు విజయవాడలో నా ఇంటిలో జరిగింది. దీనికి మా కుటుంబ సభ్యులతో పాటు నా అనుచరులు ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు. రెండు రోజుల తర్వాత గత నెల 31న తిరుమల కొండకు నడిచి వెళ్లాం అన్నారు. తప్పుడు రాతలు, కూతలు కూసినట్లుగా తాము పద్మావతి అతిధి భవనంలో లేమన్నారు. ఈ నెల ఒకటో తేదీన స్వామివారి దర్శనం చేసుకుని అదే రోజు సాయంత్రం విజయవాడ వరద బాధిత సహాయక చర్యలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పాల్గొన్నా అన్నారు.
విషయం తెలుసుకోకుండా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏడుకొండల పై విష ప్రచారం చేస్తూ తప్పుడు రాతలు కూడా రాశారన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి పండగ నిర్వహించే కుటుంబ సభ్యురాలిగా వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నా నా కుమారుడు పుట్టినరోజు వేడుకలు విజయవాడలో చేసుకున్నాము అన్నారు. కానీ దైవ సన్నిధిని అపవిత్రం చేస్తూ తప్పుడు ప్రచారం చేసిన వారికి దేవుడే సరైన శిక్ష విధిస్తరన్నారు. తిరుమల కొండను అపహస్యం చేసిన వారు గతంలో ఏం జరిగిందో గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆ దైవ సన్నిధి పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. ప్రజలు నా అభిమానులు ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.