పట్టణాభివృద్ధికి ప్రణాళికలు –       గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని 11 వ వార్డు చిన్న హరిజన పేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.

మొదటిసారిగా వార్డుకు వచ్చిన మంత్రికి నాయకులు, వార్డు ప్రజలు, యువత ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ప్రజావేదిక ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అసలు పాలకులు ఉన్నారో లేదో అన్నట్లుగా మున్సిపాలిటీలో పాలన సాగుతుందన్నారు. పారిశుధ్యం అధ్వానంగా ఉందని తాగునీరు, సామాజిక మరుగుదొడ్లు, మురుగు కాలువల సమస్య ఎక్కువగా ఉందన్నారు.

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలు వార్డుల వారీగా స్వీకరించి పురాభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. చిన హరిజన పేటలో తాగునీటి సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని కమిషనర్ రాఘవాచార్యులకు ఆదేశించారు. వంద రోజుల పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మంత్రి వివరించారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్, డీ ఎఫ్ వో ప్రసూన, పట్టణ అధ్యక్షుడు నిమ్మాది చిట్టి, వార్డు ఇన్చార్జి బాల, కె. చంద్రశేఖర్, జనసేన నేత శివ కృష్ణ, భాను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *