పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి
విజయవంతంగా ముందుకు సాగాలి
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా “ఆయుధ పూజ”
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పోలీస్ కార్యాలయంలో దుర్గామాత ఆశీస్సులకై పోలీసు ఆయుధాలు, వాహనాలకు నిర్వహించిన ఆయుధపూజ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసారు.
దుష్టశిక్షణ, శిష్ట రక్షణగా చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ సమయంలో ఆనవాయితీగా చేయు ఆయుధపూజను జిల్లా ఎస్పీ మేలతాళాలు, వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా, భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో పోలీస్ సిబ్బంది రోజువారీ చర్యల్లో ఉపయోగించే పలు రకాల ఆయుధాలతో పాటు మోటారు ట్రాన్సుపోర్ట్ విభాగంలోని వివిధ రకాల పోలీసు వాహనాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకూడదంటూ ప్రత్యేక పూజలు చేసి జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బంది, ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసులకు ముఖ్యమైన పండగ
ఆయుధ పూజ అనేది పోలీసులు, భద్రతా దళాలకు అత్యంత ముఖ్యమైన పండగని, పోలీసులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు కట్టుబడి ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా వ్యవహరించాలని, ఈ పండుగ అందరికీ కొత్త విజయాలు చేకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు దేవి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, అన్ని వర్గాలవారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అన్ని విషయాలలో విజయవంతంగా ముందుకు సాగుతూ జిల్లా పోలీస్ శాఖ మంచి పేరు ప్రతిష్టలు సాధించాలని ఎస్పీ అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) ఓ.దిలీప్ కిరణ్, ఆర్ ఐ శ్రీరాములు,టి.శ్రీనివాసరావు, ఆర్ ఎస్ ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.