రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడతాం
శివరాంపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి
గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని అప్పుల గ్రూపులోకి నెట్టేసింది. చివరికి ఆరుగారం కట్టించి పండించే రైతులను కూడా దోచుకుందని మహిళ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. రంగుల పిచ్చితో 2600 కోట్ల రూపాయలు మాజీ సీఎం జగన్ వృధా చేశారన్నారు. రైతులకు ధాన్యం డబ్బులు కూడా చెల్లించకుండా దగా చేశారన్నారు. సాలూరు మండలం శివరంపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ఉచితంగా గోనె సంచులు, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చులు భారం కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం. దళారుల భారిన పడి రైతులు మోసపోవద్దన్నారు. రైతులు కళ్ళల్లో ఆనందమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. కొనుగోలు కేంద్రాల్లో పంటను తీసుకొన్న 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం అని చెప్పారు.
గత ప్రభుత్వంలో రైతుల పక్షాన పోరాడిన మా అందరిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. జిల్లాలోని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 183 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని రైతులకు ఇబ్బంది కలగకుండా కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతుల ప్రయోజనాల కోసం 183 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని, ఒక్కో కేంద్రానికి ముగ్గురు చొప్పున తాత్కాలిక సిబ్బందిని నియమించామని వివరించారు. కంప్యూటరీకరణ, ట్రక్ షీట్లు, మిల్లులకు ధాన్యం తరలింపు, తేమ శాతం తెలుసుకోవడంపై సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, శిక్షణ ఇస్తున్నామన్నారు. రైతులు వారికి నచ్చిన మిల్లులకు ధాన్యం ఇచ్చుకోవచ్చని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే జిల్లా కలెక్టర్ కార్యాలయం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమును కూడా ఏర్పాటుచేసినట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయుటకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని కోరారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ జిల్లాలో 2.20లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు 510 కోట్లు నిధులు కేటాయించారు అన్నారు. క్వింటాకు 2300 రూపాయలు మద్దతు ధర వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భంజ్, , జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, కరిబుగత భాస్కర రావు, చొక్కాపు త్రినాధ, మత్స శ్యామ్, సూర్యనారాయణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.