కూటమి మేనిఫెస్టోతో రాష్ట్ర పున:నిర్మాణం

  • బీజేపీ సహకారంతో వంద శాతం మేనిఫెస్టో అమలు
  • ఐదేళ్లుగా అన్ని రంగాల్లో తిరోగమనం
  • జగన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం
  • ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌

అమరావతి: జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో సర్వనాశనం అయిన రాష్ట్రాన్ని పున:నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, అది టీడీపీతో కలిసి రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోతో సాధ్యమౌతుందని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. టీడీపీ,జనసేన ఉమ్మడిగా రూపొందించిన 2024 ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసి ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత తీసుకుంటాయని చెప్పారు. ఇందుకు బీజేపీ నుండి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ …ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌ కత్తి మొనపై వేలాడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగుజాతి నేడు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితిని చూసి తలదించుకుంటోంది. లూటీ కోసమే రూ.13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత అయిదేళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటుచూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కానవస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారు. రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేస్తూ నవమోసాలు చేస్తున్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24 శాతంతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలలో 2వ స్థానంలో ఉంది. పోలవరం, నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశాడు. సంపద సృష్టి, ఉపాధికల్పనా కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.లక్ష కోట్లు దారి మళ్లించాడని పవన్‌ ధ్వజమెత్తారు.

అన్న క్యాంటీన్లు, నిరుద్యోగభృతి, పండుగ కానుకలు లాంటి వందకు పైగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ రద్దు చేశాడు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారు. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌, గంజాయి, డ్రగ్స్‌, ఎర్ర చందనం, రేషన్‌ బియ్యం మాఫియాలతో రూ.8 లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 10% కోతకోసి 16,800 రాజ్యాంగబద్ధ పదవులకు బీసీలను దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారని పవన్‌ పేర్కొన్నారు. 30 వేల మంది ప్రాణాలు తీసి వారి భార్యల మాంగల్యాలు మంటగలిపారు. గృహనిర్మాణం పేరుతో పేదలను అప్పులపాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను 600 మందిని హత్య చేశారు. బాబాయి వివేకానందరెడ్డి హంతకులను కాపాడుతున్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు దారిమళ్ళించి గ్రామ, పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఈ ఎన్నికల రూపంలో ఒక్క అవకాశం మన ముందుకు వచ్చింది. సైకో పాలనను సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికి ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరుపై ఉన్నదని పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో ఆరు హామీలను మీముందు వుంచాము. జనసేన పార్టీ ప్రతిపాదించిన ‘షణ్ముఖ వ్యూహం’ అంశాలను పొందుపరిచాం. వాటిని మీరందరూ ఆమోదించడం మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలన్నింటినీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అవసరమైన నిధులను సాధించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తామని పవన్‌ కళ్యాణ్‌ హామీనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *