చెత్త బుట్ట ఏర్పాటు చేయాలని పలుమార్లు చెప్పినా చేయకపోవడమే కారణం
విస్తు పోయిన బ్యాంకు అధికారులు
రోడ్డుపై చెత్త వేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని పారిశుద్ధ్య విభాగం సిబ్బంది బ్యాంకు ఆవరణలో చెత్త వేసి నిరసన తెలిపారు. ఈ విషయం తెలియక సాలూరు కెనరా బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్ బ్యాంక్ ఆవరణలో వేసిన చెత్త చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త వేసిన వారిపై చర్యలు చేపట్టాలంటూ మున్సిపల్ కమిషనర్ సిహెచ్. సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పారిశుధ్య విభాగం కార్యదర్శి శ్రీకాంత్ కమిషనర్ ను కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. బ్యాంకు అధికారులు సిబ్బంది చెత్తను రోడ్డుపై వేస్తున్నారని ఇలా వెయ్యొద్దని గత ఆరు నెలలుగా చెబుతున్న పట్టించుకోవడంలేదని కమిషనర్ తెలిపారు. గతంలో మున్సిపల్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ రాగా రోడ్డుపై చెత్త చూసి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఇది పునరావృతం అయితే పారిశుధ్య కార్యదర్శి పై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారని శ్రీకాంత్ కమిషనర్ కు తెలిపారు. కెనరా బ్యాంక్ ఆవరణలో చెత్త వేసేందుకు డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు అధికారులకు చెప్పాలని, బ్యాంకు ముందు వేసిన చెత్తను తొలగించాలని కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులకు ఆదేశించారు. బ్యాంకు నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని చెప్పారు. నిబంధనల మేరకు రోడ్డుపై చెత్త వేసిన వారిపై ఫైన్ విధించాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు.