రూ.70.90 కోట్లతో ఆంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి,
ప్రాథమిక సదుపాయాల కోసం రూ. 70.90కోట్లు నిధులు కేటాయించాం. ఒక్కో ఆంగన్వాడీ కేంద్రానికి రూ. 1 లక్ష చొప్పున విడుదల చేశాం.
ఈ నిధులతో ఎల్ఇడి టీవీ, ఆర్‌ఓ ప్లాంట్లు, బెంచీలు, కుర్చీలు, పిల్లలకు బొమ్మలు వంటి సదుపాయాలను కల్పిస్తాం అని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆమె ఈ వివరాలను వెల్లడించారు. ఆంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా మెరుగుపరుస్తాం. గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక 4977 అంగన్వాడి కేంద్రాల నిర్మాణ పనులు జరిపేందుకు 32.64 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. 2941 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 5,31,446 గర్భిణులు, బాలింతలు, 13,03,384 మంది మూడు సంవత్సరాల లోపు పిల్లలు, ఏడు లక్షల మంది 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్యం, పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది ద్వారా అందజేస్తున్నాం అన్నారు. అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు తల్లీ పిల్లల ఆరోగ్యాని కై చేస్తున్న కృషి అభినందనీయం. ప్రీస్కూల్ నిర్వహణలో కూడా కార్యకర్తలు చక్కగా పనిచేయుట కేంద్రాల సందర్శనలో గమనించడమైందని మంత్రి చెప్పారు. ఈనెల 16న అంగన్వాడీ కార్యకర్తలు మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల వద్ద వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేసిన విషయం మా దృష్టికి వచ్చిందని అన్నారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలలు మాత్రమే అయింది. అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య దశలవారీగా పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. సమ్మెలు, ఆందోళనలతో సమస్యలు పరిష్కరించబడవు. సమ్మెలు చేసి కేంద్రాలు మూసివేయుట ద్వారా గర్భవతి బాలింత మహిళలు, పిల్లలకు అత్యవసరమైన పోషకాహార సేవలు అందించుటకు ఆటంకం కలుగుతుందన్నారు. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యూటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అంగన్వాడీ సిబ్బంది అందరూ సానుకూల దృక్పథంతో ఆలోచించి లబ్ధిదారులకు సేవలు అందించడంలో ఎటువంటి ఆటంకం కలుగకుండా చూడాలని కోరారు. అంగన్ వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి చెప్పారు.